యుగానికి ఒక్కడు, అవారా, నా పేరు శివ వంటి చిత్రాల ద్వారా తెలుగులో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న తమిళ హీరో కార్తీ శంకర్ దయాల్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ ప్రణీత హీరొయిన్ గా వచ్చిన సినిమా ‘శకుని’. తమిళ్లో ‘శగుని’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో సమస్యల్లో చిక్కుకొని చివరికి ఈ రోజే విడుదలైంది. శకుని చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ :
కాకినాడ పక్కనే ఉన్న సామర్ల కోటలో ఉండే కమల్ కృష్ణ (కార్తీ) కుటుంబం నుండి తరతరాలుగా వస్తున్న ఇల్లును రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా తొలగిస్తున్నట్లు రైల్వే శాఖ నుండి నోటీసు వస్తుంది. కొందరు రాజకీయ నాయకుల స్వార్ధం కోసం బ్రిడ్జి నిర్మాణం తమకు అనుగుణంగా మార్చుకున్నారని తెలుసుకున్న కమల్ రైల్వే మంత్రికి అర్జీ పెట్టుకోవడానికి హైదరాబాదుకి వస్తాడు. రైల్వే మంత్రిని కలవడం కుదరట్లేదు అని ఆ బ్రిడ్జి నిర్మాణ విషయంలో ముఖ్యమంత్రి ఆర్కే భూపతి (ప్రకాష్ రాజ్) సహాయం కోసం వెళతాడు. అక్కడికి వెళ్ళిన కమల్ కి ఆ బ్రిడ్జి కాంట్రాక్టు తీసుకుంది భూపతి అని తెలుస్తుంది. సహాయం కోరిన కమల్ ని భూపతి అవమానిస్తాడు. తనకు ఉన్నా సమస్యని, జరిగిన అన్యాయాన్ని కమల్ ఎలా పరిష్కరించుకున్నాడు అనేది మిగతా సినిమా.
ప్లస్ పాయింట్స్ :
కార్తీ గత సినిమాల్లాగే నటనలో ఎనర్జీ చూపించాడు. డాన్సులు చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. ఫైట్స్ పర్వాలేదనిపించాడు. చిత్ర మొదటి భాగమంతా ఎంటర్టైన్ చేస్తూ రెండవ భాగంలో పొలిటికల్ గేమ్ ఆడుతూ అలరించాడు. రమణక్క పాత్రలో రాధిక చాలా బాగా చేసింది. ముఖ్యమంత్రి ఆర్కే భూపతిగా ప్రకాష్ రాజ్ కి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. ప్రతిపక్ష నాయకుడు వి.టి.ఎమ్.కె పార్టీ అధ్యక్షుడు పెరుమాళ్ళు పాత్రలో కోట బాగానే చేసాడు. లేడి పొలిటీషియన్ వసుంధర పాత్రలో కిరణ్ రాథోడ్ పాత్ర పరిధి మేరకు నటించింది. ఆటో డ్రైవర్ రజినీ పాత్రలో సంతానం నవ్వించే ప్రయత్నం చేసాడు. బీడీ బాబా పాత్రలో నాజర్ బాగా చేసాడు.
మైనస్ పాయింట్స్ :
శ్రీదేవి పాత్రలో ప్రణీత చాలా వీక్. చిత్ర ఈ సినిమాకి ఆమె ఏ మాత్రం ఉపయోగపడింది లేదు. మొదటి భాగంలో ఆమె పాత్ర పరిమితంగా ఉన్నారెండవ భాగంలో ఒక్క పాట మినహా ఆమె అస్సలు కనిపించదు. చిత్ర మొదటి భాగంలో కార్తీ, సంతానం మధ్య కామెడీ సన్నివేశాలు బాగానే ఉన్నా స్టొరీ నేరేషన్ అస్సలు బాగాలేదు. సినిమా ప్రారంభంలో సత్యమూర్తి (చంద్ర మోహన్) పాత్రని కేవలం అక్కడే చూపించి ఆ పాత్ర ఎపిసోడ్ కి దర్శకుడు సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయాడు. చిత్ర రెండవ భాగంలో హీరో తన సమస్యని వదిలేసి భూపతిని ముఖ్యమంత్రి సీటు నుండి దించడమే లక్ష్యంగా చేసుకోవడంతో ప్రేక్షకుడికి ఆసక్తి లోపించింది. వీటికి తోడు హీరోకి సరైన ప్రత్యర్ధి లేక హీరో చప్పగా సాగుతుంది. స్క్రీన్ప్లే లోపాలు కూడా చాలా ఉన్నాయి. దర్శకుడి మొదటి సినిమా కావడంతో డైరెక్షన్ విషయంలో తడబడ్డాడు. రోజా పాత్రని కూడా సరిగా వాడుకోలేకపోయారు.
సాంకేతిక విభాగం :
చాలా సన్నివేశాల్లో లిప్ సింక్ కుదరలేదు, డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. డైలాగుల విషయంలో కూడా కేర్ తీసుకుని బావుండేది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అస్సలు బాలేదు. పాటలు బాగాలేకపోగా నేపధ్య సంగీతం కూడా ఏ మాత్రం బాగాలేదు. ఎడిటింగ్ గజిబిజిగా ఉంది. సినిమాటోగ్రఫీ బావుంది.
తీర్పు :
పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన శకుని కార్తీ నటనతో గట్టెక్కింది. మొదటి భాగం కామెడీతో సాగి రెండవ భాగం పొలిటకల్ టర్న్ తీసుకుని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.